పవన్‌పై దిల్‌రాజు ‘పింక్‌’ చల్లుతున్నాడట!!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు దూరమై పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. తాను ఇకపై సినిమాలు చేయనని, పూర్తిగా ప్రజా సేవకే అంకితమవుతానని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆయన చిత్రసీమ రీ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన రీఎంట్రీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈసారి పవన్‌ను తెరపై చూపించే ఛాన్స్‌ను దిల్‌రాజు అందుకున్నట్లు ఫిలిం సర్కిల్‌లో గుసగుసలు మొదలయ్యాయి. అంతేకాదు.. దీనికోసం బాలయ్యతో తెరకెక్కించాలనుకున్న కథను పవన్‌ కోసం పక్కకు పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ కథ మరేదో కాదు.. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘పింక్‌’ రీమేక్‌. తొలుత దీన్ని బాలకృష్ణతో తెరకెక్కించాలని దిల్‌రాజు ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దీన్నే పవన్‌తో చేయాలని చూస్తున్నాడట ఈ స్టార్‌ ప్రొడ్యూసర్‌. నిజానికి పవన్‌కు సినిమా చేసే ఆసక్తి లేనప్పటికీ తక్కువ రోజుల్లో, పెద్దగా కష్టపడే పనిలేకుండా పూర్తయ్యే సినిమా కావడంతో పవన్‌తో దీన్ని కచ్చితంగా తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నాడట. ఇదే విషయమై ఇప్పటికే పవర్‌స్టార్‌తో చర్చలు కూడా జరుపుతున్నారట దిల్‌రాజు. అంతేకాదు.. ఈ రీమేక్‌ చేసినందుకు పవన్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. చిత్ర లాభాల్లో 50శాతం వాటాను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట దిల్‌రాజు. ప్రస్తుతం ఈ డీల్‌పై పవన్‌ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే తన నిర్ణయం చెప్తానని రాజుకు మాటిచ్చారట. మరి అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది కల్లా ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో వాస్తవమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ పవన్‌తో ‘పింక్‌’ రీమేక్‌ అన్నది వింటానికి చాలా బాగుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.