మెట్రో రైల్లో పవన్‌ ప్రయాణం..

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ కోసం మియాపూర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో రైలెక్కి పవన్‌ అభిమానులను ఆశ్చర్య పరిచారు. అమీర్‌పేట స్టేషన్లో ట్రైన్ మారారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో సంభాషించారు. ద్రాక్షారామానికి చెందిన రైతు సత్యనారాయణతో పవన్‌ మాట్లాడుతూ.. పంటలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతిందని ఆ రైతు వాపోయారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ రైతు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణం తనకు ఇదే మొదటిసారి అని రైతు చెప్పగానే పవన్‌ నవ్వుతూ మీకే కాదు.. నాకు కూడా ఇదే మొదటి సారి అని అన్నారు. పవన్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు తదితరులు ఉన్నారు.








Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.