సెట్ల కోసమే రూ.30కోట్లట

వర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో సెట్స్‌పై ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ 27వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్నారు. మొగలాయుల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో భారీ పీరియాడికల్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. ఇందులో పవన్ రాబిన్‌హుడ్‌ తరహా దొంగలా కనిపించబోతున్నట్లు సమాచారం. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ భారీ చిత్రంలో సెట్లదే కీలక భూమిక అని తెలుస్తోంది. వందల ఏళ్ల క్రితం నాటి కథ కాబట్టి ఆనాటి వాతావరణానికి తగ్గట్లుగా ప్రముఖ కళా దర్శకులతో అనేక సెట్లు నిర్మిస్తోందట చిత్ర బృందం. అందుకే గతంలో అనుకున్న బడ్జెట్‌కు మరింత అదనంగా ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారట చిత్ర నిర్మాత. తాజాగా ఈ విషయం చిత్రసీమలో చర్చనీయాంశమైంది. మొదట క్రిష్‌ దీన్ని రూ.50 కోట్ల బడ్టెట్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. కానీ, పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కే చిత్రం కావడం.. చారిత్రక నేపథ్యమున్న సినిమా కావడంతో నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడీ చిత్ర బడ్జెట్‌ను రూ.80 కోట్లకు పెంచినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ మొత్తంలో దాదాపు రూ.30 కోట్లు కేవలం చిత్ర సెట్ల నిర్మాణం కోసమే ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 20కి పైగా ప్రత్యేక సెట్లను రూపొందించబోతుందట చిత్ర బృందం. ఈ చిత్రంలోని దాదాపు 90శాతం చిత్రీకరణ ఈ సెట్లలోనే జరుగనుందని సమాచారం. ఇందులో పవన్‌ లుక్‌ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇప్పుడీ చిత్రం కోసం ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్ర బృందం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.