సంక్రాంతి పండక్కి వకీల్‌ సాబ్‌ వస్తాడట!


పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ లాయర్‌గా నటిస్తోన్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండగకి బరిలోకి దిగనుందని సమాచారం. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే కొంతభాగం జరపుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ ఆగిపోయింది. అయితే మిగిలిన సన్నివేశాలను ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల కల్లా చిత్రీకరణ ప్రారంభించినా సంక్రాంతి బరిలో నిలవడానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చిత్రబృందం ఆలోచిస్తుందట. ప్రస్తుతం ప్రభుత్వాలు చిత్రీకరణకు అనుమతి ఇచ్చినా కూడా షూటింగ్‌ జరుపుకునే పరిస్థితి కనిపించడం లేదు. కారణం రోజురోజుకు తెలుగు రాష్ర్టాల్లో పెరుగుతున్న కరోనా కేసులే ఇందుకు ఉదాహరణ అంటూ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న జక్కన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్.‌ఆర్’‌తో పాటు చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ మహేష్‌బాబు నటించనున్న ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్‌ నటిస్తోన్న ‘పుష్ప’ లాంటి చిత్రాలు సంక్రాంతికి వచ్చేటట్లు కనిపించడం లేదు. అందుకే ‘వకీల్‌ సాబ్’‌ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు చిత్రనిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుందని సినీ వర్గాల్లో వార్తలు బయటకు వస్తున్నాయి. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’‌ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.