ఆ పేరుకు.. క్రేజ్‌కు ప్రభాస్‌ అర్హుడు : బన్ని

‘బాహుబలి’తో ఎంత పేరు సంపాదించుకున్నా.. ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్‌ దక్కించుకున్నా దానికి అన్ని విధాల ప్రభాస్‌ అర్హుడు’’ అంటూ డార్లింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌. తాజాగా ఆయన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచి అదిరిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చక్కటి వసూళ్లు దక్కించుకుంటోంది. ఇది బన్ని కెరీర్‌లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ ఇప్పటికే రికార్డు అందుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్‌ ‘బాహుబలి’ గురించి ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘బాహుబలి’ గురించి రాజమౌళితో వ్యక్తిగతంగా కలిసి చెప్పాను కానీ, ఇప్పటి వరకు అందరి ముందు చెప్పే అవకాశం రాలేదు. ‘బాహుబలి’తో ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ఎంతటి క్రేజ్‌ సంపాదించుకున్నా దానికి అన్ని విధాల అర్హుడు ఆయన. ‘మిర్చి’ లాంటి హిట్‌ చిత్రం తర్వాత ఓ కమర్షియల్‌ హీరో ఓ ఐదేళ్లలో ఎన్నో కోట్లు సంపాదించుకొని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్‌ డేస్‌ ఉంటాయి. మిగతా మూడున్నరేళ్లు ఖాళీగా ఉంటాయి. కానీ, ప్రభాస్‌ అన్నేళ్లు ఒక విషయాన్ని నమ్మి కూర్చున్న దానికి, ఆయన చేసిన త్యాగానికి ఎంత వచ్చినా కూడా దానికి ఆయన అర్హుడే. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషించా. ప్రభాస్‌కు అంత పెద్ద విజయం దక్కినందుకు నేను చాలా ఆనందించా’’ అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.