ప్ర‌భాస్‌కి `సైరా` సినిమా చూపించారా?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌థానాయ‌కుల మ‌ధ్య మంచి స‌ఖ్య‌త ఉంది. ఒక‌రి సినిమాకి మ‌రొక‌రు మాట సాయం చేసుకుంటుంటారు. అవ‌స‌ర‌మైతే విడుద‌ల తేదీల్ని కూడా అటు ఇటు స‌ర్దుబాటు చేసుకుంటుంటారు. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నటించిన `సాహో` ట్రైల‌ర్ చూశాక చిరంజీవి ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఆ విష‌యం గురించి ప్ర‌భాస్ గొప్ప‌గా చెప్పుకున్నారు కూడా. చిరు `సైరా` టీజ‌ర్ చాలా బాగుంద‌ని ఇటీవ‌ల మ‌హేష్ ఓ వేడుక‌లో చెప్పారు. ఇలా క‌థానాయ‌కుల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అందుకే ఇటీవ‌ల మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు జోరందుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఎవ‌రెవ‌రు క‌లిసి తెర‌పై సంద‌డి చేస్తారో ఊహించ‌లేం. అల్లు అర్జున్‌కీ ప్ర‌భాస్‌కీ, రామ్‌చ‌ర‌ణ్‌కీ మహేష్‌కీ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల ప్ర‌భాస్‌కి రామ్‌చ‌ర‌ణ్ కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యార‌ట‌. రాజ‌మౌళి త‌న‌యుడి పెళ్లి నుంచి మా మ‌ధ్య బాండింగ్ మ‌రింత పెరిగింద‌ని ఇటీవ‌ల ప్ర‌భాస్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. తాజాగా రామ్‌చ‌రణ్ ఇంట్లో ప్ర‌భాస్ ప్ర‌త్య‌క్ష‌మవ‌డంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్య అనుబంధం మరోసారి చ‌ర్చ‌కొచ్చినట్టైంది. అక్క‌డ ఇద్ద‌రూ క‌లిసి చాలాసేపు గ‌డిపార‌ట‌. ప్ర‌భాస్‌కి చ‌ర‌ణ్ త‌న ఇంట్లో `సైరా ` సినిమా చూపించార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ప్ర‌భాస్ ఇదివ‌ర‌కు `బాహుబ‌లి`లాంటి భారీ చిత్రం చేశారు. ఆయ‌న అభిప్రాయం తెలుసుకొనేందుకే `సైరా`ని చూపించార‌నే మాట వినిపిస్తోంది. మ‌రి ప్ర‌భాస్ సినిమానే చూశారో లేదంటే ట్రైల‌ర్ మాత్రమే చూశారో తెలియ‌దు. `సైరా` చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా నిర్మించిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల 2న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.