‘సాహో’ కథానాయకుడితో ప్రశాంత్‌ నీల్‌ కొత్తచిత్రం?

ప్రభాస్‌ 22వ సినిమా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోందా? అందుకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయా? అంటే! ఈ ప్రశ్నలకి అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి కన్నడ సినీ వర్గాలు. ‘కె.జి.ఎఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. పాన్‌ ఇండియా స్థాయి సినిమాల్ని తెరకెక్కించగల దర్శకుడిగా ఇప్పటికే మంచి పేరు సంపాదించిన ప్రశాంత్‌ ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్‌: ఛాప్టర్‌ 2’ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం తెలుగు కథానాయకులతోనే ఉండబోతోందనే మాట గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ కలయికలో సినిమా కూడా ఖాయమైంది. అయితే ప్రభాస్‌తోనూ ప్రశాంత్‌నీల్‌ ఓ సినిమా చేయబోతున్నారని కన్నడ చిత్రసీమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరవాత వైజయంతి మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కథానాయిక. వీటి తరువాతనే ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉండబోతోందని చెప్పుకుంటున్నారు. మాఫియా నేపథ్యంలో, పాన్‌ ఇండియా స్థాయిలోనే ఆ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.