దక్షిణాది ప్రముఖ నటుల్లో పృథ్వీరాజ్ సుకుమరన్ ఒకరు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటుడు హిందీలో విజయవంతమైన ‘అంధాదున్’ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా నటించిన పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తుండగా, రాధికా ఆఫ్టే పాత్రలో అహానా కృష్ణ, టబు పోషించిన పాత్రలో మమతా మోహన్‌దాస్ నటించనున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. తెలుగులో రీమేక్ అవుతున్న ‘అంధాదున్’ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇక పృథ్వీరాజ్ ప్రస్తుతం ‘ది కోల్డ్ కేస్’ అనే చిత్రం చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనమ్ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్‌గా కనిపించనున్నాడు.