‘విరాటపర్వం’ కోసం ఎదురు చూస్తున్నా: ప్రియమణి

‘పెళ్లైయిన కొత్తలో’, ‘యమదొంగ’, ‘కింగ్‌’లాంటి చిత్రాల్లో నటించి అలరించిన నటి ప్రియమణి. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో ప్రియమణి బెల్లి లలిత అనే పాత్రలో నటిస్తుంది. వెంకీ ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా సాయి పల్లవి నటిస్తుంది. తాజాగా చిత్రం గురించి ప్రియమణి మాట్లాడుతూ.. ‘‘ఇదొక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న గొప్పచిత్రం. సినిమా అంతా 1992నాటి నక్సలిజం నేపథ్యంలో ఉంటుంది. నా పాత్ర గురించి అందరికి చెప్పాలని ఉంది. చాలా తీవ్రమైన పాత్ర అని చెప్పగలను. సినిమా ఎప్పుడు ప్రారంభమౌతుందా అని నేను ఎదురు చూస్తున్నా’’ అంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభమై కొంతభాగం చిత్రీకరణ జరుపుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ఇంకా ఇందులో నందితా దాస్, టబు, జరీనా వహబ్, ఈశ్వరీ రావు తదితరలు నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న సినిమాకి దగ్గుబాటి సురేష్, సుధాకర్‌ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియమణి ఇంకా తెలుగులో వెంకటేష్‌తో కలిసి ‘నారప్ప’లో నటిస్తుంది. ‘సిరివెన్నెల’ అనే మరో చిత్రంలోనూ నటిస్తుంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.