ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాం...

‘‘మనం ఇప్పుడు ఇద్దరి మాటల్ని తప్పక వినాలి. ఒకరు పోలీసు, ఇంకొకరు డాక్టర్‌. వాళ్లు చెప్పిన నియమాల్ని మనం కచ్చితంగా పాటించాలి. లాక్‌డౌన్‌ అంటే మనకు కష్టంగా ఉంటుంది. అయినా తప్పదు. ఇంట్లో ఉంటూ పుస్తకాలు చదువుకోండి. లేదా సినిమాలు చూడండి. అందరం దీన్నొక సవాల్‌గా తీసుకోవాలి’’ అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌. కరోనా వైరస్‌ని ఇప్పుడు అరికట్టకపోతే మరణాల సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతుందని లాక్‌డౌన్‌ తప్పనిసరని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడిన ఓ వీడియోని నటి, నిర్మాత ఛార్మి ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. అందులో పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘గ్లోబల్‌ వార్మింగ్‌ లాంటి మాటలు విన్నప్పుడు మనం జోకులు వేస్తుంటాం. కరోనా వచ్చి ఇప్పుడు అందరి చెంపల్ని లాగి కొడుతోంది. ఇప్పుడు మనకు అన్నీ అర్థమవుతాయి. ఎక్కువ సందర్భాలు వైరస్‌లన్నీ నగరాల్లోనే పుడతాయి. అందుకు కారణం జనాభానే. అడవిలో ఎందుకు పుట్టవంటే అక్కడి జంతువులన్నీ ప్రకృతిలో బతుకుతుంటాయి. మనుషులం మాత్రం ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాం. దానివల్ల అన్ని వైరస్‌లూ పుడుతున్నాయి. కాలుమీద కాలు వేసుకుని దేశానికి సేవ చేసే సమయం వచ్చిందనీ, ఇంట్లోనే కూర్చుని దేశాన్ని కాపాడండని కోరారు పూరి.

గుర్తుంచుకోండి
కరోనా ప్రభావంతో జనసంచారం బాగా తగ్గిపోయింది. జనం ఇళ్లకే పరిమితం కావడంతో జంతువులు, పక్షులు స్వేచ్ఛగా.. బయటికొస్తున్నాయి. పూరి జగన్నాథ్‌ ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించారు. ‘‘ముంబయిలోని మెరైన్‌ డ్రైవ్‌లో వందలాది డాల్ఫిన్లు, హైదరాబాద్‌ కేబీ ఆర్‌ పార్క్‌ బయట నెమళ్లు ఆడుకుంటున్నాయి. దయచేసి ఈ గ్రహాన్ని వాటితో కలిసి పంచుకుంటున్నామనే విషయాన్ని గుర్తుంచుకోండి’’ అని ట్వీటారు పూరి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.