రౌడీ రెడీ అన్నా.. పూరితో నిర్మించేదెవరు?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ జోష్‌లోనే తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన విజయ్‌ దేవరకొండతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతవరకు రౌడీ నుంచి కానీ, పూరి నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ సినిమా ఓకే అయిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడీ వార్తలే నిజమనుకున్నా.. ఈ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దేవరకొండ పలువురు అగ్ర నిర్మాణ సంస్థల వద్ద నుంచి అడ్వాన్సులు తీసేసుకున్నాడు. కాబట్టి ఒకవేళ తనేమైనా కొత్త చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా సదరు బ్యానర్లలోనే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడిదే పూరికి చిక్కు సమస్యలా మారేలా కనిపిస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా పూరి జగన్నాథ్‌ తన సినిమాలన్నింటినీ సొంత బ్యానర్‌లోనే నిర్మించుకుంటున్నాడు. తాజాగా విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’నూ పూరి కనెక్ట్స్‌పైనే నిర్మించి లాభాలు అందుకున్నాడు. వాస్తవానికి ఈ లాభాలు కేవలం పూరిని ఆర్థిక ఇబ్బందుల Aనుంచే గట్టెక్కించాయని చెప్పొచ్చు. అతను మళ్లీ మునుపటిలా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవాలంటే మరో హిట్‌ కొట్టక తప్పదు. ఇలా చేయాలంటే దేవరకొండతో చేయబోయే చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం రౌడీ హీరో తీసుకున్న కమిట్‌మెంట్స్‌ చూస్తుంటే అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది తెలియట్లేదు. ఒకవేళ మరో నిర్మాణ సంస్థతో కలిసి భాగస్వామ్యంలో నిర్మించాలన్నా దానికి ఛార్మి నుంచి పూరికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కూడా పూరి కనెక్స్ట్‌లో భాగస్వామే. వారిద్దరూ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై పూరి నుంచి రాబోయే చిత్రాలన్నింటికీ ఛార్మి సహ నిర్మాతగా ఉండాల్సిందేనట. మరి దీనికి మిగతా నిర్మాతల అంగీకరిస్తారా అన్నది అనుమానమే. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. రౌడీ రెడీ అన్నా, చిత్ర నిర్మాణ విషయంలో పూరికి తలనొప్పులు తప్పేలా లేవు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.