ఈ ముగ్గురు కలిసింది అందుకేనా??

రానా.. కోవెలమూడి ప్రకాశ్‌ మధ్యలో శ్రుతిహాసన్‌. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇంతకీ వీరంతా కలిసి ఏం చేస్తున్నట్లు.. ఈ అరుదైన కలయిక ఉన్నట్లుండి సోషల్‌ వాల్‌పై ప్రత్యక్షమవడానికి వెనకున్న మతలబేంటి? అని ఆరా తీస్తే ఫిలిం వర్గాల్లో ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి. శ్రుతి 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కొన్నాళ్లు తన ప్రియుడు, రాక్‌ బ్యాండ్‌ సభ్యుడైన మైఖేల్‌ కోర్సల్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకోని తిరిగింది. కానీ, ఈ మధ్య ఈ బంధం తెగిపోవడంతో మళ్లీ సినీ కెరీర్‌పై దృష్టి సారించింది శ్రుతి. ఈ నేపథ్యంలోనే ఇటీవల హాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ కూడా కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘ట్రెడ్‌స్టోన్‌’ అనే సిరీస్‌లో ఆమె నటించబోతుంది. అంతేకాదు.. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కొత్త కథలు వింటోందట. తాజాగా ప్రకాశ్‌ - రానా ముంబయికి వెళ్లి శ్రుతిని కలిసింది కూడా ఇలాంటి కారణంతోనే అట. ప్రస్తుతం వీరి ముగ్గురి మధ్య ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరిగాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీన్ని పట్టాలెక్కించాలని యోచిస్తున్నట్లు, ఈ ప్రాజెక్టుకు సూచికంగానే ఇప్పుడిలా సెల్ఫీ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో వాస్తవమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ.. త్వరలో ఈ ముగ్గురి కలయికలో ఓ మూవీ పట్టాలెక్కే ఛాన్స్‌ లేకపోలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రకాశ్‌ కోవెలమూడి బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌ రావ్‌ - కంగనా రనౌత్‌లతో ‘మెంటల్‌ హై క్యా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జులైలో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రానా కూడా ‘విరాటపర్వం’, ‘హిరణ్య కశిప’, ‘1942’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా గడిపేస్తున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.