సూపర్‌స్టార్‌ అదరగొడుతున్నారుగా..
మిళ సీమలో కుర్రహీరోలు ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లోనే నటిస్తుంటే.. రజనీకాంత్‌ మాత్రం ఈ వయసులోనూ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ జోరు చూపిస్తున్నారు. ఎనిమిది నెలల కాలంలో ‘కాలా’, ‘2.ఓ’, ‘పేట’ అంటూ ఏకంగా మూడు చిత్రాలను బాక్సాఫీస్‌ ముందుకు దింపి సినీప్రియుల్ని అలరించిన రజనీ.. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. తలైవా ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ఇప్పుడిది సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు సంతకాలు చేసేశారట రజనీ. వీటిలో ఒకదానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించబోతుండగా.. మరోదానికి వినోద్‌ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. వీరిద్దరూ మంచి ప్రతిభ ఉన్న దర్శకులే. ముఖ్యంగా రజనీ - రవికుమార్‌ కాంబినేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరికి కలయికలో వచ్చిన ‘ముత్తు’, ‘నరసింహా’, ‘లింగ’ బాక్సాఫీస్‌ ముందు భారీ హిట్లు అందుకొన్నాయి. ఇక వినోద్‌.. కార్తితో ‘ఖాకీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించి సత్తా చాటారు. ఈ టాలెంటెడ్‌ దర్శకులిద్దరూ ఇప్పటికే రజనీకి కథలు వినిపించేశారట. మరి వీటిలో ముందుగా ఏది సెట్స్‌పైకి వెళ్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే సూపర్‌స్టార్‌ ఇలా ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టడంపై అభిమానుల్లో ఓవైపు సంతోషం కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ఆందోళన కూడా నెలకొని ఉంది. ఎందుకంటే 2021లోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. రాజకీయ ప్రవేశంపై రజనీ ఇప్పటికైతే ఓ క్లారిటీ ఇచ్చారు కానీ, సంస్థాగతంగా తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఇంతవరకు ఏ చర్యలు ప్రారంభించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ కేడర్‌ను బలోపేతం చేసుకోవాలంటే కనీసం ఏడాదిన్నర సమయమైనా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో రజనీ ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటం ఓ వర్గం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.