నిర్మాతగా ‘లూసిఫర్‌’.. కథానాయకుడుగా ‘అసురన్‌’?
ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొణిదల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై చిరంజీవి కథానాయకుడుగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నిర్మించారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ చిరుతో తెరకెక్కిస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు చెర్రీ. మరోవైపు మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు చెర్రీ సన్నాహాలు చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇందులో కథానాయకుడుగా చిరంజీవి నటించే అవకాశాలున్నాయి. తాజాగా చెర్రీ మరో సినిమా రీమేక్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. అదే.. ధనుష్‌ కథానాయకుడుగా వచ్చిన ‘అసురన్‌’. తమిళనాట ఇటీవలే విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాపై టాలీవుడ్‌ అగ్ర నటుడు మహేష బాబు కామెంట్‌ చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో చరణ్‌ రీమేక్‌ చేస్తున్నాడంటూ వచ్చే ఊహాగానాలపై అభిమానుల్లో చర్చ మొదలైంది. చరణ్‌ గతంలో నటించిన ‘రంగస్థలం’ చిత్రం కథలానే మాస్‌గా ఉండటంతో ఆయనకు సెట్‌ అవుతుందని అనుకుంటున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం చెర్రీ కథానాయకుడుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో, నిర్మాతగా ‘చిరు 152’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.