రామోజీ ఫిలింసిటీలో అల్లూరి గర్జన

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులు. అజయ్‌దేవగణ్‌ కీలక పాత్రధారి. డీవీవీ దానయ్య నిర్మాత. రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. న్యాయస్థానం నేపథ్యంలో కొన్ని కీలకసన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు వేషధారణలో రామ్‌చరణ్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. బ్రిటిష్‌ న్యాయస్థానం ముందు అల్లూరి సీతారామరాజుని హాజరు పరిచిన నేపథ్యంలోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణ ప్రారంభమై అప్పుడే ఏడాది గడిచింది. ఇప్పటి వరకూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయలేదు. డిసెంబరు 31న తొలి ప్రచార చిత్రం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనేది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. టైటిల్‌ గురించి కూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ‘‘రామోజీ ఫిలింసిటీకి మళ్లీ రావడం ఆనందంగా ఉంది. ఉదయాన్నే ఫిలింసిటీకి వస్తే భలేగా ఉంటుంది. ఉదయపు షూటింగ్‌ని ఆస్వాదిస్తాను’’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోని పంచుకున్నారు రామ్‌చరణ్‌. 2020 జూన్‌ 30న ఈ చిత్రం విడుదల కానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.