వాహ్‌వా రానా.. ఎంతలా మారిపోడో కదా!
కోలీవుడ్‌ ఊసరవెల్లులు ఎవరు? అని అడగ్గానే.. ఎవరికైనా విక్రమ్, కమలహాసన్, విజయ్‌ సేతుపతి, సూర్య తదితరుల పేర్లు ఠక్కున గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే పాత్ర కోసం రూపు మార్చుకునే కథానాయకుల జాబితాలో ముందు వరుసలో ఉండే దక్షిణాది ప్రముఖులు వీరే. అక్కడ ఈ ట్రెండ్‌ ఎప్పటి నుంచో ఉన్నదే. మరి టాలీవుడ్‌లో అలాంటి వారెవరున్నారు అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాత్రం దగ్గుబాటి రానానే. ‘బాహుబలి’లో భళ్లాల దేవుడి పాత్ర కోసం భారీ అవతారంతో దర్శనమిచ్చిన రానా.. ఆ వెంటనే ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో చంద్రబాబు పాత్ర కోసం పూర్తిగా సన్నబడి కొత్తలుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఇలా పూర్తయిందో లేదో మళ్లీ తన కొత్త చిత్రం కోసం కొద్దిగా బరువు పెరిగారు రానా. కానీ ఇప్పుడు ‘హాథీ మేరే సాథీ’ చిత్రం కోసం మళ్లీ సన్నబడి గుబురు గడ్డెంతో స్టైలిష్‌ లుక్‌లోకి మారిపోయారు. తాజాగా ఈ సినిమాలోని రానాకు సంబంధించిన లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఫొటోల రానా మురికి పట్టినట్లుగా ఉన్న ఓ వదులైన బ్రౌన్‌ కలర్‌ షర్టు వేసుకోని మాసిన గడ్డంతో ‘శివపుత్రుడు’లో విక్రమ్‌ స్టైల్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోను అకస్మాత్తుగా చూస్తే.. అందులో ఉన్నది రానా అని కనిపెట్టడం కూడా కష్టమే. ప్రభు సాలమన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో రానా ఓ మావటి పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.