మరోసారి ‘రాజా ది గ్రేట్‌’ అనిపిస్తాడా?

రవితేజ నటించిన వైవిధ్య కథల్లో ‘రాజా ది గ్రేట్‌’ ఒకటి. కళ్లు కనపించని వ్యక్తి పాత్రలో ఒదిగిపోయి అదరగొట్టాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. మరోసారి రాజా సందడి మొదలవుతుందని టాలీవుడ్‌ టాక్‌. లాక్‌డౌన్‌ సమయంలో అనిల్‌ రావిపూడి పలు స్ర్కిప్టులు సిద్ధం చేసుకున్నారు. వీటిలో ‘ఎఫ్‌ 3’ ముందుగా రూపొందబోతుంది. గతంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా ఆయన తీసిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఓ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట అనిల్‌. ఇప్పటికే ఆ కథను సాయి పల్లవికి వినిపించారని, ఎందుకో తెలియదు కానీ ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రచారం సాగుతోంది. దాంతో మరో ఎంటర్‌టైనింగ్‌ స్టోరీని రవితేజ దగ్గరకు తీసుకెళ్లారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రానికి కొనసాగింపు అని తెలుస్తోంది. ఫుల్‌ జోష్‌ ఉన్న పాత్ర కావడంతో రవితేజ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. మరి ‘ఎఫ్‌ 3’ తర్వాత ఏ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం రవితేజ ‘క్రాక్‌’లో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. దీంతోపాటు రమేష్‌ వర్మతో ‘ఖిలాడి’ చేస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.