మహేష్‌ - సందీప్‌.. ‘షుగర్‌ ఫ్యాక్టరీ’ కథ ఇది!!

ర్జున్‌ రెడ్డి’ చిత్రంతో తొలి అడుగులోనే తెలుగు చిత్రసీమలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్‌ వంగా. ఇదే చిత్రాన్ని ‘కబీర్‌ సింగ్‌’గా హిందీలోనూ తెరకెక్కించి అక్కడ కూడా సత్తా చాటారు. ఇటీవలే విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టి బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి రాబోయే తర్వాతి చిత్రంపై ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఆయన తన తర్వాతి ప్రాజెక్టును మహేష్‌బాబుతో చేయబోతున్నట్లుగా రకరకాల వార్తలొచ్చాయి. ఓ సరికొత్త కథాంశంతో రూపొందబోయే ఈ చిత్రానికి ‘షుగర్‌ ఫ్యాక్టరీ’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. అయితే తాజాగా ఈ అంశంపై సందీప్‌ క్లారిటీ ఇచ్చారు. ‘షుగర్‌ ఫ్యాక్టరీ’ పేరుతో తాను కథ రాసుకున్న విషయం నిజమేనని. అది మహేష్‌తో చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని ప్రకటించారు. నిజానికి ఆ కథను ‘అర్జున్‌రెడ్డి’ కన్నా ముందే రాసుకున్నారట సందీప్‌. దాన్ని సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌లలో ఎవరో ఒకరితో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదట. మొత్తానికి ఇదండి.. మహేష్‌ - సందీప్‌ల షుగర్‌ఫ్యాక్టరీ కథ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.