తేజు కోసం నిర్మాతల పోటీ

ఏడాదిన్నర కిందట వరకు వరుస పరాజయాలతో సతమతమైన సాయితేజ్‌.. ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో విజయాల బాటలోకి వచ్చేశారు. ఇప్పుడాయన నుంచి ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రం విడుదలయ్యేందుకు ముస్తాబవుతుండగా.. దేవ కట్టా దర్శకత్వంలో చెయ్యనున్న కొత్త సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడీ హడావుడి ముగియక ముందే తేజు కోసం నిర్మాతల పోటీ మొదలైనట్లు తెలుస్తోంది. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో వసూళ్ల పరంగానూ తన మార్కెట్‌ను పెంచుకున్న తేజు.. ఇప్పుడు మీడియం రేంజ్‌ బడ్జెట్‌ చిత్రాలకు మంచి ఆప్షన్‌గా మారాడు. అందుకే బివిఎస్‌ఎన్‌ ప్రసాద్, దిల్‌రాజు, వైష్ణో కృష్ణ వంటి అగ్ర నిర్మాతలందరూ ఈ మెగా హీరోతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. తేజు ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్‌ విన్నాక దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. దీన్ని బివిఎస్‌ఎన్‌ నిర్మించనున్నట్లు సమాచారం. ఇక దిల్‌రాజు, వైష్ణో కృష్ణలు కూడా తేజుకు సరిపడే కొత్తదనం నిండిన కథల కోసం వేట సాగిస్తున్నారని తెలుస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.