అర్జున్‌ - ప్రీతి మళ్లీ కలుస్తున్నారు..

‘అర్జున్‌ రెడ్డి’.. ఈ ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ పేరు చెప్పగానే విజయ్‌ దేవరకొండ - షాలిని పాండేల బోల్డ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్సే కళ్లముందు మెదులుతుంది. అర్జున్‌గా విజయ్‌ తన పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో.. ప్రీతిగా షాలిని కూడా అంతే చక్కగా పాత్రలో లీనమై నటించింది. అందుకే తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి సినీప్రియులు నీరాజనం పట్టారు. ఇప్పుడీ జోడీ మరోసారి తెరపై సందడి చేసేందుకు ముస్తాబవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భరత్‌ కమ్మ ‘డియర్‌ కామ్రేడ్‌’, దర్శకుడు క్రాంతి మాధవ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో.. వీటి తర్వాత నూతన దర్శకుడు ఆనంద్‌ అన్నామలైతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. బహుభాషా చిత్రంతో రూపొందబోయే ఈ చిత్రంలో దేవరకొండ ఓ ప్రొఫెషనల్‌ బైకర్‌గా కనిపించనున్నాడట. దీనికోసం ఆయన ఇప్పటికే దిల్లీలో ప్రొఫెషనల్‌ బైకర్స్‌ వద్ద శిక్షణ కూడా తీసుకున్నాడట. ఇక ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశముండగా.. ఓ పాత్రలో ‘పేటా’ ఫేం మాళవిక మోహనన్‌ కనిపించబోతుండగా మరో నాయికగా షాలిని పాండేను ఎంపిక చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై దర్శకుడు ఆమెతో చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందట. ఈ క్రేజీ ప్రాజెక్టును మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘హీరో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.