శర్వా.. కార్తికేయలతో సెట్స్‌పైకి!!

‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌తో తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి.. రెండో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ఆపసోపాలు పడుతున్నారు. తాను సిద్ధం చేసుకున్న ‘మహాసముద్రం’ స్క్రిప్ట్‌తో అనేక మంది హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది రవితేజ నుంచి నాగచైతన్య వరకు అనేక మంది హీరోల చేతులు మారి.. ప్రస్తుతం శర్వానంద్‌ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఆయన పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇక ఈ కథలో మరో కథానాయకుడి పాత్రకు ఛాన్స్‌ ఉందని, ఆ పాత్ర కోసం ఓ యువ హీరోని ఫైనల్‌ చేసినట్ల తాజాగా చిత్ర సీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పాత్ర చేయబోయేది మరెవరో కాదు.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కార్తికేయనే. అంతేకాదు ఇప్పుడీ చిత్రాన్ని నిర్మించేందుకు ఎకె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొని ఉన్న కరోనా పరిస్థితులు సద్దుమణిగాక చిత్రాన్ని ఎప్పుడు పట్టాలెక్కించేది ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈలోపు ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేసుకునే పనిలో ఉండనున్నారట అజయ్‌ భూపతి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.