శర్వా చేతిలోకి చరణ్‌ ప్రాజెక్ట్‌

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమలో చిత్రీకరణల సందడి లేకున్నా.. భవిష్యత్‌ ప్రాజెక్టుల విషయంలో కథానాయకులు జోరు చూపిస్తూనే ఉన్నారు. ఈ విరామ సమయంలో చక్కగా కథలు వింటూ ఆసక్తికరమైన ప్రాజెక్టులకు పచ్చజెండాలు ఊపేస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు శర్వానంద్‌ ఇదే విధంగా జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన నుంచి ‘శ్రీకారం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. అజయ్‌ భూపతితో చెయ్యాల్సిన ‘మహా సముద్రం’ సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. దీంతో పాటు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. ఇప్పుడీ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరబోతుంది. అది ఓ కొత్త దర్శకుడితో యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఉండనుంది. అంతేకాదు ఇది రామ్‌చరణ్‌ హీరోగా నటించాల్సిన కథ అని కూడా తెలుస్తోంది. చరణ్, శర్వాల స్నేహితుడైన శ్రీరామ్‌ రెడ్డి అనే వ్యక్తి ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. తొలుత ఈ కథను చెర్రితో చెయ్యాలనుకుందట యువి సంస్థ. కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇప్పుడీ ప్రాజెక్టు కాస్తా శర్వానంద్‌ చేతుల్లోకి వచ్చింది. అయితే ఇది సెట్స్‌పైకి వెళ్లాలంటే మాత్రం మరింత సమయమే పట్టే అవకాశాలున్నాయి. ఒకవేల పరిస్థితులన్నీ అనుకూలిస్తే ‘మహా సముద్రం’ తర్వాత శర్వా చెయ్యబోయే ప్రాజెక్టు ఇదే అవనుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.