ఓటీటీలో విడుదల కానున్న శర్వానంద్‌ ‘శ్రీకారం’?

‘ప్రస్థానం’ చిత్రంతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘జర్నీ’ నటుడు శర్వానంద్‌. ప్రస్తుతం బి.కిశోర్‌రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకారం’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ వేదికగా విడుదల కానుందని సమాచారం. శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక  మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య చాలా సినిమాలు థియేటర్లో కాకుండా డిటిటల్‌ వేదికగా ఓటీటీ రూపంలో విడుదల అవుతున్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు డిజిటల్‌ మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇంకా మిగిలిన చిత్ర కార్యక్రమాలను అక్టోబర్‌లో పూర్తి చేయనున్నారు. రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత స్వరాలు అందిస్తుండగా, సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్‌ రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ జనవరి 27, 2020న విడులైంది. చిత్రంలో సాయికుమార్‌, మురళి శర్మ, రావు రమేష్‌, ఆమని, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. కోవిడ్‌ 19 పరిస్థితులు లేకుంటే చిత్రం ఏప్రిల్‌‌ 24, 2020న విడుదల అయ్యేది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.