నటుడు శివ ప్రసాద్‌ కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో శివప్రసాద్‌ జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ అభ్యసించిన శివప్రసాద్‌.. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఆయన సేవలందించారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగానూ పనిచేశారు.

మంచి నటుడే కాదు.. దర్శకుడు కూడా..
శివప్రసాద్‌ స్వతహాగా రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. 'తులసి', 'దూసుకెళ్తా', 'ఆటాడిస్తా', 'మస్కా', 'కుబేరులు', 'ఒక్కమగాడు', 'కితకితలు', 'డేంజర్', 'ఖైదీ' చిత్రాల్లో ఆయన నటించారు. 'ప్రేమ తపస్సు', 'టోపీ రాజా స్వీటీ రోజా', 'ఇల్లాలు', 'కొక్కొరొకో' చిత్రాలకు శివప్రసాద్‌ దర్శకత్వం వహించారు.

రెండు సార్లు ఎంపీగా..
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే శివప్రసాద్‌ రాజకీయాల్లోకి వచ్చారు. తెదేపాలో చేరిన ఆయన 1999-2004 మధ్య ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య కాలంలో రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన శివప్రసాద్‌ ఓటమిపాలయ్యారు.

నిరసనల్లో ఆయనది ప్రత్యేక శైలి
సామాజిక చైతన్య కార్యక్రమాలంటే ఆయనకెంతో ఇష్టం. శివప్రసాద్‌ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చేది వివిధ సమస్యలపై తనదైన వేషధారణలతో ఆయన చేపట్టే నిరసనలే. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. శివప్రసాద్‌ నిరసనలు భిన్నంగా ఉండటంతో అందరి దృష్టి ఆయనపై ఉండేది. పార్లమెంట్‌ సమావేశాలు జరిగే సమయంలో రోజుకో వేషధారణతో ఆయన నిరసన చేపట్టేవారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం శివప్రసాద్‌ తన వాణిని బలంగా వినిపించేవారు. రాముడు, కృష్ణుడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, హిట్లర్‌, మాంత్రికుడు.. ఇలా విభిన్న వేషధారణలతో ఆయన తనదైన శైలిలో పార్లమెంట్‌ ఆవరణలో పలు ప్రజా సమస్యలపై నిరసన గళం విన్పించేవారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.