పదేళ్ల ‘షాపింగ్‌మాల్‌’

వసంతబాలన్‌ దర్శకత్వ ప్రత్యేకతను చాటిచెప్పిన చిత్రం ‘అంగాడి తెరు’. ఇదే సినిమా తెలుగులో ‘షాపింగ్‌మాల్‌’గా వచ్చింది. మహేష్, అంజలి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించింది. పెద్ద వస్త్ర దుకాణాల్లో జరుగుతున్న దారుణాలు, కూలీల ఆవేదనలను ఈ సినిమా చాటిచెప్పింది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు వసంత బాలన్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు. అందులో.. ‘నా జీవితంలో వెలుగు నింపిన చిత్రం ‘అంగాడి తెరు’. వాస్తవానికి ఈ కథను సుమారు 10 మంది నిర్మాతలకు వినిపించా. కానీ అవకాశాలు రాలేదు. చివరగా కరుణామూర్తి, అరుణ్‌పాండియన్‌లకు వినిపించాకే నా కథకు మంచి రోజులు వచ్చాయి. అయినప్పటికీ కొన్ని కారణాలు, పరిస్థితులతో సినిమా పూర్తిచేయడం సమస్యాత్మకంగా మారింది. అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. ఆ తర్వాత నిర్మాతలు, పంపిణీదారులకు దానిని చూపించాం. విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తామే విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అది మార్చి ఆఖరు. ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే పెద్ద హీరోల సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మాకు మార్చి 26 మాత్రమే ఉంది. లేకుంటే జూన్‌లో విడుదల చేసుకోవాలి. అప్పటికే చిత్రాన్ని ప్రారంభించి దాదాపు నాలుగు సంవత్సరాలవుతోంది. సినిమాను విడుదల చేసి తీరాల్సిన పరిస్థితి. అందుకే మార్చి 26న విడుదల చేశాం. పాత్రికేయుల మన్ననలు దక్కాయి. అదే మా తొలి విజయం. మౌత్‌ టాక్‌తో ప్రేక్షకాధరణ పెరిగింది. గొప్ప విజయంతో పాటు.. గౌరవం దక్కింది. తెలుగులో ‘షాపింగ్‌మాల్‌’గా విడుదలై విజయం సాధించింది. అక్కడ అంజలికి మంచి మార్కెట్‌ వచ్చింది. మా శ్రమకు అవార్డులు ఊరటనిచ్చాయి. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.