ఓ వైపు కమల్‌తో.. మరోవైపు రజనీతో?

కెరీర్‌ ప్రారంభంలో ప్రేమకథలకు చిరునామాగా నిలిచాడు సిద్దార్థ్‌. గత కొంతకాలం తర్వాత విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసి అలరించాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు కమల్‌ హాసన్‌తో తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో అవకాశం అందుకున్నాడు. ఇందులో సిద్ధుది కీలక పాత్రట. గతంలో శంకర్‌ తీసిన ‘బాయ్స్‌’ సినిమాలో ఓ కథానాయకుడుగా నటించాడు సిద్దార్థ్‌. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషలో వస్తుండటం, కమల్‌తో నటించే అవకాశం దక్కించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే, రజనీ కాంత్‌తోనూ నటించనున్నాడని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. రజనీ కథానాయకుడుగా దర్శకుడు శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించేందుకు సిద్దార్థ్‌ను ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోంది. కథలో కీలకమైన యువకుడి పాత్ర కావడంతో సిద్ధునే న్యాయం చేయగలడనే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదల కానున్నాయి. మరి సిద్ధు.. రజనీతో కలిసి నటిస్తాడా, లేదా? అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఏది ఏమైనా ఒకేసారి ఇద్దరు అగ్ర నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం విశేషమని వినిపిస్తోంది తమిళ చిత్ర సీమలో.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.