బాలీవుడ్‌లో అగ్రతారలుగా దక్షిణాది కథానాయికలు!


కళకు భాషాబేధం ప్రాంతీయ బేధాలు అస్సలు ఉండవు. కళకారుడు తన భావాన్ని అర్థమయ్యేలా చెప్పడంలోనే ఎక్కడైనా రాణిస్తారు. దక్షిణాది నటి నిత్యమేనన్‌ ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ‘బ్రీతి: ఇన్‌టు ది షాడోస్‌’ అనే చిత్రంలో నటించింది. జులై 10న చిత్రం ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల కానుంది.  దక్షిణాది కథానాయికలు బాలీవుడ్‌లో అంతగా రాణించలేరు, సరైన అవకాశాలు రావడం లేదు అని ఎప్పట్నుంచో చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఈ విషయంపై నిత్యమేనన్‌ స్పందిస్తూ..‘‘అలా ఎందుకు అనుకోవాలి. దక్షిణాది నుంచి ఎంతో మంది నటీమణులు బాలీవుడ్‌లో అగ్రకథానాయికలుగా రాణించారు. ఇప్పుడు కూడా ఆ పంధా నడుస్తోంది. గతంలో ఒక్కసారి చూసుకుంటే పద్మిని, వహీదా రెహ్మన్‌, వైజయంతీమాల, శ్రీదేవిలాంటి వారు ఉన్నారు. వాళ్ల తరువాత ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌, దీపికా పదుకొణెలు ఉన్నారు. అయినా బాలీవుడ్‌లోనే నటించాలని ఏముంది. దక్షిణాదిలోను మంచి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. నా వరకే తీసుకుంటే నేను నాలుగు భాషల్లో నటించాను. మనకు కావాల్సింది మంచి సినిమాల్లో నటించడం. అదీ చిన్నా పెద్దా అనే తేడా ఉండకూడదు. బెంగాలీ, మరాఠి, మలయాళంలోనూ చాలా ఉత్తమమైన చిత్రాలను తెరకెక్కిస్తారు. నావరకు అయితే బెంగాలీ, మరాఠీ భాషా చిత్రాల్లో నటించడానికి ఇష్టపడతాను. నటించే అవకాశం వచ్చినప్పుడు భాష ఏదైనా మనలోని సత్తాను నిరూపించుకోవాలి. ప్రేక్షకులు ఎక్కడివారైనా ఇష్టపడతారని ’’చెప్పకొచ్చింది. గత ఏడాది నిత్య మూడు చిత్రాల్లో నటించింది. అందులో బాలీవుడ్‌లో వచ్చిన ‘మిషన్‌ మంగళ్’‌ చిత్రంలో శాటీలైట్‌ ఇంజనీర్‌ వర్ష పిళ్లై పాత్రలో అలరించింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో మైస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైకో’ చిత్రంలో నటించింది. జనవరి 24న విడుదలైన ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌, అదితిరావు హైదరి నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.