సుద్దాల అశోక్‌ తేజకు శస్త్ర చికిత్స!

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అనారోగ్యంగా ఉన్నారంటూ సోషల్‌ మీడియా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా స్పందించారు నటుడు ఉత్తేజ్‌. ‘మా మామయ్య అశోక్‌ తేజ అనారోగ్యంగా ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు నిజమే. ఈ రోజు ఆసుపత్రిలో చేరుతున్నారు. రేపు (శనివారం) శస్త్ర చికిత్స జరగనుంది. చికిత్సకు రక్తం అవసరమవుతుందేమోనని తన స్నేహితుడితో అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. రక్తం అవసరం ఉంది. ఈ మేరకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కి కాల్‌ చేశాను. అక్కడి వాళ్లు వెంటనే స్పందించారు. దాతల్ని పంపించే ఏర్పాటు చేస్తున్నారు. మామయ్య మీద ప్రేమ, అభిమానంతో ఆయన గురించి తెలుసుకునేందుకు ఫోన్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు. విషయం తెలుకున్న చిరంజీవి గారు ఉదయాన్నే ఫోన్‌ చేశారు. మామయ్యతో మాట్లాడించాను. చిరంజీవి గారి మాటలు మామయ్యకు కొండంత ధైర్యం ఇచ్చాయి’ అని తెలిపారు ఉత్తేజ్‌. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అశోక్‌ తేజకు గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో కాలేయ మార్పిడి  చికిత్స చేయనున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.