మరోసారి రామ్‌తో సుకుమార్‌?

సుకుమార్, రామ్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘జగడం’. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా నటుడిగా రామ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. తొలి సినిమా ‘ఆర్య’లో ప్రేమ చూపించిన సుక్కు వెంటనే ‘జగడం’ చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుందని టాక్‌. రామ్‌ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడట సుకుమార్‌. త్వరలోనే రామ్‌కి వినిపించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సుక్కు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇతర చిత్రాలకు కథను అందిస్తున్నాడు. కిశోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్‌’ చిత్రంలో బిజీగా ఉన్నాడు రామ్‌. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక ఇద్దరు కలిసి పనిచేస్తారని వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.