అలనాటి బాలీవుడ్‌ హాస్యనటుడు జగదీప్‌ కన్నుమూత

బాలీవుడ్‌కు చెందిన అలనాటి హాస్యనటుడు జగదీప్ అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడినట్లు తన కుటంబ సభ్యులు తెలియజేశారు. ఆయన వయసు ఎనభైయెక్క సంవత్సరాలు. బి.ఆర్‌.చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘అఫ్సానా’ చిత్రంలో బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత ‘మున్నా’, ‘ఆర్‌ పార్’‌ చిత్రాల్లో నటించాడు. ఆయన దాదాపు 400 చిత్రాల్లో నటుడిగా పనిచేశారు. హాస్యనటుడిగా ఆయనకు చాలా పేరుంది. ‘షోలో’ చిత్రంలో సూర్మ భోపాలి పాత్రలో ఆయన చేసిన హాస్యం అంతాఇంతా కాదు. హర్రర్‌ చిత్రాలకు పేరైన తులిసి రామేసే దర్శకత్వంలో వచ్చిన ‘పురాణ మందిర్’‌లోనూ మచ్చర్‌ సింగ్‌గా నటించి మెప్పించాడు. ఆయ‍న చివరగా ‘గల్లీ గల్లీ చోర్‌ హై’ చిత్రంలో నటించారు. ఆయన మార్చి 29, 1939లో మధ్యప్రదేశ్‌లోని దతియాలో జన్మించారు. ఈయనకు ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు కూడా ఉన్నారు. వీరు బాలీవుడ్‌లో క్యారెక్టర్‌ నటులుగా రాణిస్తున్నారు. జగదీప్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. రేపు ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.