ఆ పాత్ర కోసం రూ.కోటి అడిగిందట!!

నితిన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘భీష్మ’తో చక్కటి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో.. వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు చేసేందుకు సంతకాలు చేశారు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ను పట్టాలెక్కించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. కథ రిత్యా ఈ చిత్రంలో విలన్‌ ఓ లేడీ నాయిక. మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా పండించి మెప్పించింది. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని చిత్ర బృందం ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే ఈ పాత్ర చేయడానికి టబు కూడా అంగీకరించిందని.. కానీ, ఆమె ఈ పాత్ర చేయడానికి రూ.1కోటి డిమాండ్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఆ సినిమాకు దాదాపు రూ.2కోట్ల పైన అందుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘అంధాదున్‌’లోని ఈ కీలక పాత్ర కోసం రూ.1కోటి డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. కానీ, చిత్ర నిర్మాతలు మాత్రం ఇంత మొత్తం ఆమెకు ఇచ్చుకోవడానికి సుముఖంగా లేరట. అందుకే ఇప్పుడీ పాత్ర కోసం మరో నాయికను వేటాడే పనిలో పడిందట చిత్ర బృందం. మరి ఇప్పుడీ లక్కీ ఛాన్స్‌ను ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.