‘జగదీష్‌’ జోరు

లాక్‌డౌన్‌కి ముందు సింహభాగం చిత్రీకరణని పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. అన్‌లాక్‌ తర్వాత రంగంలోకి దిగిన చిత్రబృందాలు కొవిడ్‌ భయాలతో, అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. కొవిడ్‌ వల్ల ఇదివరకటితో పోలిస్తే పనిలో వేగం తగ్గినా, ఎట్టకేలకి సినిమాల్ని ముగింపు దశకు తీసుకొస్తున్నారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌’ కూడా వడివడిగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటూ, చివరి షెడ్యూల్‌లోకి అడుగు పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్‌ కథానాయికలు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, రావు రమేష్‌, నరేష్‌, నాజర్‌, దేవదర్శిని, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, కళ: సాహి సురేష్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, పోరాటాలు: వెంకట్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.