కరోనాపై పోరులో మేముసైతం తెలుగు దర్శకనిర్మాతలు

తెరపైనే కాదు... నిజ జీవితంలోనూ తాము హీరోలమే అని నిరూపిస్తూ సాయం చేస్తున్నారు నటులు. దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో తెలుగు చిత్రసీమ సాయం కొనసాగుతోంది. శుక్రవారం పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

కరోనాపై పోరుకి కథానాయకులతో పాటు పలువురు అగ్ర దర్శక, నిర్మాతలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల కోసం తమ వంతుగా రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు ప్రముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షలు అందివ్వనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే బాటలో మరో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తరఫున రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించారు నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌. ఈ మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు చొప్పున కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్‌ అధినేత సి.అశ్వనీదత్‌ రూ. 20 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షలు చొప్పున అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.

సుకుమార్‌.. తమన్‌ల సాయం

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10లక్షల విరాళం ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగీత వాయిద్యకారుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌. హైదరాబాద్, చెన్నై సినీ మ్యుజిషియన్స్‌ యూనియన్‌కు తన వంతుగా రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. సుధీర్‌బాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ.2 లక్షలు సాయం ప్రకటించారు. నాయిక ప్రణీత 50 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2000ల చొప్పున సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.