
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఆసక్తికర అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరో యువ నాయిక నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీకి జోడీగా బాలీవుడ్ భామ అలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అంతేకాదు తారక్‌కి జోడీగా మరో నాయికకి అవకాశం ఉందంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. భీమ్‌ని ప్రేమించే గిరిజన యువతి పాత్ర ఉంటుందని, నిడివి తక్కువైనా ప్రాధాన్యత కలిగిందని సమాచారం. అలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్ని ఎవరు చేయగలరు? అనే అన్వేషణలో భాగంగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ పేరు తెరమీదకు వచ్చింది. నటనలో తొలి అడుగువేసినప్పటి నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటూ తనని తాను నిరూపించుకుంది. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ఈ అవకాశం ఇచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర బృందం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ‘రెండు జళ్ల సీత’ సినిమా కథానాయకుల్లో ఒకరైన రాజేష్ తనయ ఈ ఐశ్వర్య రాజేష్. ‘కౌసల్య కృష్ణమూర్తి ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
