కన్నీళ్లు పెట్టుకున్న ‘పులకేశి’ వడివేలు

కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి పలువురు సినీ తారలు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిస్థితులను చూసి కొందరు హీరోలు, కథానాయికలు మళ్లీ మళ్లీ అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొందరు మారడం లేదంటూ వీడియోల ద్వారా సందేశాన్ని పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు తాజాగా అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. ‘చాలా మనోవేదనకు గురవుతున్నా. ప్రభుత్వం చెప్పే మాటలను అర్థం చేసుకోండి. వారి ఉత్తర్వుల మేరకు అందరూ కొన్ని రోజులపాటు ఇళ్లలోనే ఉండండి. వైద్య ప్రపంచమే భయాందోళనకు గురవుతోంది. వైద్యులు, నర్సులు ప్రాణాలను పనంగా పెట్టి సేవలందిస్తున్నారు. దయచేసి అందరూ సహకరించండి. ఎవరూ బయటకు రాకండి. పోలీసులు కూడా మిమ్మల్ని బతిమలాడటాన్ని చూస్తున్నా. బిడ్డాపాపలతో హాయిగా ఇంట్లోనే ఉందాం. ఎవరూ తేలికగా తీసుకోకండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ నవ్వించే ఆయన ఇలా కన్నీళ్లతో సందేశమిస్తుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.