ఇంటి నుంచే ‘వకీల్‌సాబ్‌’ సేవలు!!


పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కరోనా దెబ్బ పడకపోయి ఉంటే ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయిపోయి ఉండేది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాను పూర్తి చెయ్యడానికి మేజర్‌ షెడ్యూల్‌లు కూడా ఏం లేనట్లు తెలుస్తోంది. ఓ చిన్న షెడ్యూల్‌ మినహా చిత్రీకరణ దాదాపు ముగిసినట్లు సమాచారం. ఎలాగూ కరోనా పరిస్థితుల నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుండటంతో.. ఈలోపు ఇంటి నుంచే ఈ చిత్ర నిర్మాణాంతర పనులను పూర్తి చెయ్యాలని చూస్తోంది చిత్ర బృందం. దీనికి తగ్గట్లుగానే పవన్‌తో ఇంటి నుంచే డబ్బింగ్‌ చెప్పించేందుకు సిద్ధమవుతున్నారట. పవన్‌ సైతం ఇంటి నుంచే తన పూర్తి చేయడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట నిర్మాత దిల్‌రాజు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు చిత్ర సీమ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతోనే పవన్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ ఈ సినిమాతో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ భారీ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇది పూర్తి చేసిన వెంటనే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కించనున్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.