వరుణ్‌తో సేతుపతి తలపడతాడా?

ఇటీవలే ‘గద్దలకొండ గణేష్‌’గా మాస్‌ కథాంశంతో వచ్చి విజయం అందుకున్నాడు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌. దీంతో ఆయన తదుపరి చిత్రం విషయంలో ఆసక్తి చూపుతున్నారు సినీ అభిమానులు. వాళ్ల ఊహకు తగినట్లు బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడు. ‘బాక్సర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు తేజ్‌. ఈ కథలో విలన్‌ పాత్ర కీలకంగా ఉండబోతుందట. మరి ఇలాంటి వైవిధ్యభరిత ప్రతినాయక పాత్ర పోషించేందుకు ఎవరు బావుంటారని వెతికే ప్రయత్నంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పేరు ప్రముఖంగా వినిపించింది. విజయ్‌ సేతుపతి ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలడు. ఇప్పటికే ‘సైరా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. దీంతో ఈ పాత్రకు విజయ్‌నే తీసుకుందామనుకుందట చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల విజయ్‌ స్థానంలో మరో నటుడ్ని ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి వరుణ్‌తో ఎవరు తలపడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.