ఇద్దరు కాదు.. ఒక్కరే ‘అసురన్‌’!!
‘వెంకీమామ’ తర్వాత వెంకటేష్‌ చేయబోతున్న కొత్త చిత్రం ఇప్పటికే ఖరారైపోయింది. ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తాజా తమిళ హిట్‌ ‘అసురన్‌’ను తెలుగులో ఆయనే చేయబోతున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండగా.. సురేష్‌ ప్రొడక్షన్స్‌పై పతాకంపై నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుతం స్ర్కిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో ఇద్దరు అసురన్‌లు కాకుండా ఒక్కరే దర్శనమివ్వబోతున్నారట. అంటే.. తెరపై ఒకే వెంకీ కనిపిస్తాడట. అసలు విషయం ఏంటంటే ఈ చిత్ర మాతృకలో ధనుష్‌ యువకుడిగా, వయసు మీద పడిన వ్యక్తిగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. కానీ, తెలుగు వెర్షన్‌లో మాత్రం ఈ రెండు పాత్రల్లో వెంకీ ఒకదాన్ని మాత్రమే పోషించబోతున్నారట. వయసు మళ్లిన వ్యక్తి పాత్రను వెంకటేష్‌ చేయబోతున్నట్లు తెలుస్తుండగా.. యువకుడి పాత్రకు ఓ యువ కథానాయకుడిని ఎంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ వార్తలో వాస్తవమెంతన్నది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఒకవేళ ఇదే నిజమైతే ‘ఎఫ్‌ 2’, ‘వెంకీమామ’ల తర్వాత వెంకీ నుంచి రాబోయే హ్యాట్రిక్‌ మల్టీస్టారర్‌ అవుతంది ఈ చిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.