చిరంజీవి చిత్రంలో విజయ్‌ దేవరకొండ నిజమేనా!


గత ఏడాది ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. కరోనా వైరస్‌ వల్ల ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇలా ఉండగానే చిరు సొంత సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’‌ చిత్రం రీమేక్‌ హక్కులను సొంతం చేసుకొంది. అయితే తాజాగా ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండను కీలక పాత్రలో నటింపజేసేందుకు సంప్రదించారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్రలోనే విజయ్ దేవరకొండ చేయనున్నారట. అయితే అధికారికంగా ఈ వార్తను ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ మెగాస్టార్‌ బావ అల్లు అరవింద్‌ నిర్మించిన ‘గీతగోవిందం’ చిత్రంలో కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. మరొక చిత్రం ‘టాక్సీవాలా’ను యువీ క్రియేషన్స్ తో కలిసి గీతా ఆర్ట్స్ నిర్మించారు. ‘లూసిఫర్’‌ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుజీత్‌ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు పేరు కూడా వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ‘ఫైటర్’‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా కోవిడ్‌-19 అదుపులోకి వచ్చాకనే మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాయే కాదు వాయిదా పడిన అన్నీ సినిమాలు అప్పుడే ప్రారంభించనున్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.