వ్యవసాయం చేసేవాడు విమానం ఎక్కుతాడంటోన్న సూర్య

తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సూరారై పోట్రు. తెలుగులో ఆకాశం నీ హద్దురా అనువాదం అవుతోంది. దసరా పండుగ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ట్రైలర్లో సూర్య ఆవేశంగా చెప్పే డైలాగ్‌..వ్యవసాయం చేసేవాడు విమానం ఎక్కుతాడు. విమాన టిక్కెట్టు ధర ఒక్క రూపాయ మాత్రమే అంటూ మాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్ గోపీనాథన్‌ జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తెలుగు డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా కథేంటంటే ఓ సామాన్య యువకుడు ఎయిర్‌ఫోర్స్ ఫైలెట్‌ అవుతాడు. ఆ తరువాత ఏకంగా ఓ విమాన సంస్థను ప్రారంభించాలని అనుకుంటాడు. అయితే సంస్థ స్థాపించే క్రమంలో ఆ యువకుడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాడనేది మిగిలిన కథ. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్‌లు కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో నటీనటులుగా అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, కరుణస్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్, కాళి వెంకట్ తదితరులు నటిస్తున్నారు. కరోనా వైరస్‌ వల్ల వాయిదా పడిన ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిత్రాన్ని నవంబర్‌ 12, 2020న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం మరోమారు స్పష్టం చేసింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.