నవ్వులు పూయిస్తున్న ‘ఏబీసీడీ’ ట్రైలర్‌!!
                             

మలయాళంలో మంచి విజయాన్ని అందుకొన్న ‘ఏబీసీడీ’ చిత్రాన్ని ఇప్పుడదే పేరుతో తెలుగులో పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌ - రుక్సార్‌ ధిల్లన్‌ జంటగా నటించారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. శిరీష్‌ తండ్రి పాత్రను నాగబాబు పోషించగా.. భరత్, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 17న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల ముందస్తు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను బయటకొదిలారు. శిరీష్‌ - భరత్‌ కలిసి అమెరికాను నుంచి ఇండియాకు రావడం.. ఇక్కడకు వచ్చాక కానీ, తాను తన తండ్రి వేసిన స్కెచ్‌కు బలైన విషయాన్ని శిరీష్‌ గుర్తించకపోవడం వంటి సన్నివేశాలతో వినోదాత్మకంగా ట్రైలర్‌ మొదలైంది. ఇందులో నాగబాబు అమెరికాలో స్థిరపడిన ఎన్నారైగా కనిపించనున్నారు. ఆయన కొడుకే శిరీష్‌. డబ్బు విలువ సరిగా తెలియదు. ఈ నేపథ్యంలో తన కొడుకుకు డబ్బు విలువ, జీవితం విలువ అర్థమయ్యేలా చేయాలని ఏదో కుంటి సాకుతో నాగబాబు.. శిరీష్‌ను అతని స్నేహితుడు భరత్‌ను భారత్‌కు పంపిస్తాడు. వాళ్లిద్దరూ వచ్చీ రాగానే అలవాటు ప్రకారం ఓ స్టార్‌ హోటల్‌లో దిగి ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారు. దెబ్బకు మూడు లక్షల బిల్లు అవుతుంది. ఆ మొత్తాన్ని కడదామని హోట్‌ల్‌ మేనేజర్‌ హర్షకు కార్డ్స్‌ ఇస్తే పనిచేయవు. బ్యాంక్‌కు వెళ్లి ఎంక్వైరీ చేస్త ఖాతాలో జీరో బ్యాలన్స్‌ ఉందని చెప్తారు. అప్పుడు శిరీష్‌కు అర్థమవుతుంది.. తనను తన తండ్రి బురిడీ కొట్టించి ఇక్కడకు పంపాడని. అయితే నాగబాబు వాళ్లకు బతకడానికి నెలకు ఓ ఐదు వేలు పంపుతుంటాడు. ఆ సొమ్ముతో హైదరాబాద్‌లో గడపడం కష్టం కాబట్టి ఓ స్లమ్‌ ఏరియాలో చిన్న రేకుల షెడ్డులో మకాం పెడతారు. ఈ నేపథ్యంలో వారికి ఎదురైన కష్టాలు, అవి పూయించే నవ్వులు, రుక్సార్‌తో ప్రేమాయణం ఇలా ఆసక్తికర అంశాలతో ట్రైలర్‌ను వినోదాత్మకంగా చూపించారు. మొత్తంగా కాన్సెప్ట్‌ పరంగా చూసుకుంటే శిరీష్‌ ఈసారి పక్కాగా హిట్టు కొట్టేడట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి జుదా శాండీ స్వరాలు సమకూర్చుతుండగా.. మధుర శ్రీధర్, యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.