ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘అక్షర’ టీజర్‌

నేక హిట్‌ చిత్రాలకు కథ అందించి రచయితగా మంచి పేరు తెచ్చుకున్న చిన్ని కృష్ణ.. ఇప్పుడు దర్శకుడిగా సత్తా చూపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న ఓ ఆసక్తికర బర్నింగ్‌ టాపిక్‌ను కథాంశంగా ఎంచుకొని ‘అక్షర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సురేష్‌ వర్మ, బెల్లంకొండ అహితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు వారికి దగ్గరయిన నందిత శ్వేత.. ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. అజయ్‌ ఘోష్‌, సత్య, షకలక శంకర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఆద్యంతం అజయ్‌ వాయిస్‌ ఓవర్‌తోనే సాగింది. ఇక కథ ఏంటంటే.. వైజాగ్‌లో పిండి తాతాజీ (అజయ్‌ ఘోష్‌) ఫుల్‌ ఫేమస్‌. అలాగని గొప్ప పేరున్న వ్యక్తేమో అని అనుకోకండి. అదంతా వెటకారంగా చెప్తున్న మాటలే. ఒంటరిగా జీవితాన్ని సాగించే తాతాజీ తోడుకొరకు టిక్‌టాక్‌లు చేసుకుంటూ బాధ్యత లేకుండా తిరిగే ముగ్గురు యువకులతో స్నేహం చేస్తాడు. వీళ్లు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలోని వీరి జీవితాల్లోకి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లా అడుగుపెడుతుంది టీచర్‌ అక్షర (నందితా శ్వేత). కానీ, ఆమె వల్ల వారంతా అనుకోని చిక్కుల్లో పడతారు. పోలీసులతో దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారి జీవితాలకు ఇబ్బందికరంగా మారిన అక్షరను హత్య చేయాలని పన్నాగం పనుతారు అజయ్‌ బృందం. ఇదే సమయంలో ఆమె వెనుక దాగిన ఓ గతం బయటపడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది. అసలు అక్షర గతమేంటి? ఆమె టీచర్‌గా వారి జీవితాల్లోకి రావడానికి కారణమేంటి? వంటి ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. టీజర్‌లో నందితా కనిపించిన తీరు, సత్య, అజయ్‌, శంకర్‌ల అల్లరి ఆకట్టుకుంది. టీజర్‌లో వినిపించిన నేపథ్య సంగీతం ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.