అర్జున్‌రెడ్డి’ ట్రైలర్‌.. యూట్యూబ్‌లో రికార్డు‘!!


తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’.. హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా పునర్నిర్మితమై బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. నేటికీ నిలకడగా కలెక్షన్స్‌ రాబడుతూ విశేషం. అయితే ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతుంటే.. దీనికి మాతృక అయిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఏంటీ రిలీజైన రెండేళ్ల తర్వాత ట్రైలర్‌తో ఏం రికార్డు అందుకుందా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇది నిజం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘కబీర్‌ సింగ్‌’కు లభిస్తున్న ఆదరణ, దానిపై వచ్చిన విమర్శల పుణ్యమాని ఆ చిత్ర ఒరిజినల్‌ వెర్షన్‌ అయిన ‘అర్జున్‌రెడ్డి’పైనా ఉత్తరాది సినీ ప్రియులు ఓ లుక్కేయడం మొదలుపెట్టారు. దీంతో గత కొద్దిరోజులుగా ‘అర్జున్‌రెడ్డి’ ట్రైలర్‌ను వీక్షించే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ట్రైలర్‌ దాదాపు 4 కోట్ల వ్యూస్‌కు చేరువగా వచ్చింది. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం వరకు నాన్‌ - బాహుబలి ట్రైలర్లలో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న చిత్రంగా ఉన్న ‘వినయ విధేయ రామ’ రికార్డును ‘అర్జున్‌ రెడ్డి’ చెరిపేసింది. ఈ చిత్ర ట్రైలర్‌కు దాదాపు 3 కోట్ల వ్యూస్‌ రాగా.. ‘అర్జున్‌రెడ్డి’ 3కోట్ల 95 లక్షల వ్యూస్‌తో దాన్ని అధిగమించింది. అంతేకాదు.. ‘కబీర్‌’ దెబ్బకు అమెజాన్‌ ప్రైమ్‌లో ‘అర్జున్‌రెడ్డి’ని వీక్షించే ఉత్తరాది ప్రేక్షకుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందట. అయితే దీనికి సంబంధించిన లెక్కలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.