మదిని కదిలిస్తోన్న ‘జెర్సీ’ ట్రైలర్‌..

‘‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ.. ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’’ అంటూ టీజర్‌తోనే అందరిలోనూ అంచనాలు పెంచేసింది ‘జెర్సీ’. నాని కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని.. గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని.. అర్జున్‌ అనే క్రికెటర్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడం, సహచర ఆటగాళ్లతో గొడవ, శ్రద్ధతో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడం, ఓ బిడ్డకు తండ్రి అవడం, తదితర సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. కానీ, పెళ్లి తర్వాత పదేళ్ల కాలంలో అర్జున్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోతుంది. తను జీవితంగా భావించిన క్రికెట్‌కు దూరమైపోతాడు, ఉద్యోగం లేక పెళ్లాం సంపాదనపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తుంటాడు. ఈ క్రమంలో తన కోచ్‌ (సత్యరాజ్‌) ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ బ్యాట్‌ చేతబడతాడు. కానీ, అప్పటికే తనకు 36 ఏళ్లు రావడంతో ఆట పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. తనపై భార్యకు నమ్మకం లేకున్నా కోడుకు కోసం లక్ష్యాన్ని ఏర్పరచుకోని క్రికెట్‌లో తిరిగి సత్తా చాటేందుకు సిద్ధమవుతాడు. మరి చివరకు ఏమైంది? అర్జున్‌ తాను అనుకున్నది సాధించాడా? లేటు వయసులో మైదానంలో సత్తా చాటగలిగాడా? తదితర అంశాలతో జెర్సీని రూపొందించారు. ట్రైలర్‌ ఆద్యంతం ఓ భావోద్వేగాల ప్రయాణంలా సాగినట్లు అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నాని కనబర్చిన అభినయం, తన మదిలోని సంఘర్షణ చూపించిన విధానం ఎంతో ఆకట్టుకునేలా ఉంది. శ్రద్ధా ప్రేయసిగా, గృహణిగా రెండు పాత్రల్లో ఒదిగిపోయింది. సను జాన్‌ ఛాయాగ్రహణం, అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం దీనికి నెట్టింట ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.