ఆకట్టుకుంటోన్న సూర్య.. ‘కాప్పన్‌’ టీజర్‌

తమిళ స్టార్‌ హీరో సూర్య ఈ ఏడాది వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను కళకళలాడించబోతున్నారు. వచ్చే నెల 31న ‘ఎన్జీకే’ చిత్రంతో థియేటర్లోకి రాబోతుండగా.. దీని తర్వాత మరో మూడు నెలల వ్యవధిలో ‘కాప్పన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు సూర్య. ప్రముఖ దర్శకుడు కె.వి. ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మోహన్‌లాల్, ఆర్య, బొమన్‌ ఇరానీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను బట్టీ చూస్తుంటే ఇదొక స్పై థ్రిల్లర్‌ మూవీగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో సూర్య ఓ భయంకర తీవ్రవాదిలా కనిపిస్తూనే.. దేశ రక్షణకు సాయపడే పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్‌లో ఆయన విభిన్నమైన గెటప్పుల్లో దర్శనమిచ్చారు. తీవ్రవాదిగా, నాగలి పట్టి పొలం దున్నే రైతుగా, గోవుల్ని కాసే వ్యక్తిగా ఇలా రకరకాల పాత్రల్లో ఆకట్టుకునేలా కనిపించారు. ‘‘పోరాడటం తప్పా? అని సూర్య ప్రశ్నిస్తుంటే.. ‘‘నక్సల్‌ మార్గంలో పోరాడతావా?’’ అని సమాధానం చెప్తూ నాగినీడు కూడా ఓ ఆసక్తికర పాత్రతో కనిపించారు. మోహన్‌లాల్‌ దేశ ప్రధాని మంత్రి పాత్రలో కనువిందు చేయబోతున్నారు. ఇటీవలే పెళ్లి పీటలెక్కిన ఆర్య, సాయేషా జంట ఇందులోనూ ప్రేమ జంటగా సందడి చేయబోతుంది. ఏదేమైనా టీజర్‌ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్‌’ వంటి హిట్ల తర్వాత ఆనంద్‌ - సూర్య కలయికలో రాబోతున్న మూడో చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.