ఆసక్తికరంగా ‘కిల్లర్‌’ ట్రైలర్‌

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు నాట కూడా మంచి మార్కెట్‌ సంపాదించుకున్నారు తమిళ హీరో విజయ్‌ ఆంటోని. ఇప్పుడీయ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘కిల్లర్‌’. అర్జున్‌ ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ఆషిమ కథానాయికగా కనిపించబోతుంది. ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యలకు కారణం తానేనంటూ ప్రభాకరన్‌ (విజయ్‌) పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపొతాడు. ఈ కేసును పోలీస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ టేకప్‌ చేస్తుంటారు. ఆయనకు ప్రభాకరన్‌ లొంగుబాటు వెనుక ఏదో మతలబు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత దీనిపై లోతుగా విచారణ చేయగా.. తాను ప్రేమించిన ధరణి (ఆషిమా నర్వాల్‌) కోసమే ఈ హత్యలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆమె కోసం ప్రభాకరన్‌ ఎందుకు అన్ని హత్యలు చేస్తున్నాడు? అసలామె ఏమైంది? అర్జున్‌ కేసును ఎలా ఛేదిస్తాడు? వంటి అంశాలతో ‘కిల్లర్‌’ను రూపొందించారు. ట్రైలర్‌లో అర్జున్‌ పాత్ర చాలా హైలైట్‌గా కనిపించింది. విజయ్‌ ఎప్పటిలాగే వైవిధ్యమైన నటనను కనబర్చారు. సైమన్‌ కింగ్‌ సమకూర్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.