నా ప్రాణమే మరల వచ్చిందమ్మా!

ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం ‘పెంగ్విన్’‌. ఈ సినిమాకి సంబంధించిన లిరికల్‌ సాంగ్‌ని మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ప్రాణమే.. నా ప్రాణమే..మరల వచ్చిందమ్మా..నా కంట్లో ఆనందమే ఈ ఆనందమే నీ చిరునవ్వే తెచ్చిందమ్మా’’..అంటూ సాగే ఈ పాటని కీర్తి సురేష్‌పై చిత్రీకరించారు. కిడ్నాప్‌ గురైన కుమారుడు కానరాక ఓ తల్లిపడే ఆవేదనను ప్రముఖగీత రచయిత వెన్నెలకంటి కలం నుంచి ఈ పాట జాలువారింది. సంతోష్‌ నారాయణ్‌ సంగీత స్వరాలు అందించగా, సుషా కమ్మనైన గొంతులో ఆలపించింది. కార్తిక్‌ సుబ్బరాజు సమర్పణలో స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్, ప్యాషన్‌ స్టూడియోస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. జూన్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల అవుతుంది. కీర్తి సురేష్‌ ‘మహానటి’ చిత్రం తరువాత వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రంలో నటిస్తుంది. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్‌ ఇండియా’లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. మలయాళంలో ‘మరక్కర్: అరబికడలింటే సింహాం’లో అర్చ అనే పాత్రలో చేస్తుంది. కరోనా వైరస్‌ వల్ల ఈ రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.