అందమైన పల్లెటూరి ప్రేమకథ

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌లను నాయకానాయికలుగా పరిచయం చేస్తూ.. నూతన దర్శకుడు రవికిరణ్‌ కోలా తెరకెక్కించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్‌.ఎల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మనో వికాస్‌ నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘పదెళ్ల క్రితం ఇంటర్నెట్, సెల్‌ఫోన్లు అంతగా లేని సమయంలో ఇద్దరు యువతీయువకుల మధ్య నడిచే అందమైన ప్రేమకథ ఇది. పూర్తి పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురంలో చిత్రీకరణ జరిపాం. గోదావరి అందాలు తెరపైన ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది. అనురాగ్‌ కులకర్ణి పాటలు ఆకట్టుకుంటాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు నిర్మాత. కథానాయకుడు కిరణ్‌ మట్లాడుతూ ‘‘థియేటర్లో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడూ తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోని నవ్వుతార’’న్నారు. ‘‘ఈ సినిమా మిమ్మల్నందరినీ పాత కాలానికి తీసుకెళ్తుంద’’న్నారు కథానాయిక రహస్య. ఈ కార్యక్రమంలో గాయకుడు అనురాగ్‌ కులకర్ణి, స్వరకర్త జయ్‌ క్రిష్, ఛాయాగ్రాహకులు విద్యాసాగర్, అమర్‌దీప్, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.