సూపర్‌స్టార్‌ టీజర్‌ వచ్చేసింది

సూప‌ర్ ప‌వ‌ర్‌తో ముస్తాబైన చిట్టి రంగంలోకి దిగ‌బోతున్నాడు. ఒక ల‌క్ష్యం కోసం రంగంలోకి దిగిన చిట్టి రోబో ఎలాంటి విన్యాసాలు చేయ‌బోతున్నాడనేది తెలియాలంటే `2.0` చూడాల్సిందే. ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్ష‌య్‌కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. అమీజాక్స‌న్ క‌థానాయిక. నవంబ‌రులో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న ఈ సినిమా టీజ‌ర్‌ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. శంక‌ర్ మార్క్ భారీద‌నంతో రూపుదిద్దుకున్న టీజ‌ర్ ప్రేక్ష‌కుల్ని క‌నువిందు చేస్తోంది. రేడియేష‌న్ ఆధారంగా అల్లుకున్న క‌థ అని టీజ‌ర్‌నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. అక్ష‌య్‌కుమార్ ఇందులో ఓ సూప‌ర్‌హీరోగా క‌నిపిస్తాడు. అయితే ఆయ‌న పాత్ర‌కి మాట‌లుండవు. ప‌క్షి ఆకారంలో ఆయ‌న చేసిన విన్యాసాలు ఎలాంటివ‌నేది ఈ సినిమాలో ఆస‌క్తిక‌రం. టీజ‌ర్‌లో ఒక్కసారిగా సెల్‌ఫోన్ల‌న్నీ మాయమైపోతున్న సన్నివేశాలు క‌నిపించాయి. ఫోన్లు మాయం చేస్తున్నది ఎవ‌రు? ఒక విచిత్ర‌మైన ఆకారంలో జ‌నాల్ని భ‌య‌పెడుతున్న ఆ శ‌క్తి ఎవ‌రిది? అనేది ఈ సినిమాలో ఆసక్తిక‌రం. ఆ శ‌క్తిని అడ్డుకోవ‌డానికే సూప‌ర్ ప‌వ‌ర్‌తో కూడిన చిట్టి రంగంలోకి దిగ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దిన దృశ్యాలు టీజ‌ర్‌కి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారని ప్ర‌చారం సాగుతోంది. ఇందులో అత్యధిక వ్య‌యం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌లు హాలీవుడ్ కంపెనీలు ఈ సినిమాకోసం ప‌నిచేశాయి. త్రీడీలో తెర‌కెక్కించ‌డం ఈ సినిమాకి క‌లిసొచ్చే విష‌యం. ఈ త‌ర‌హా భారీద‌నంతోకూడిన సినిమాలు త్రీడీలో చూస్తే ఆ అనుభ‌వ‌మే వేరుగా ఉంటుంది. అందుకే ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాస్త ఆల‌స్య‌మైనా సినిమాని త్రీడీలోనే తీయాల‌ని సంకల్పించారు. ఆ మేర‌కు భారీ హంగుల‌తో, ప‌లుర‌కాల వ్య‌య‌ప్ర‌యాసాల‌కోర్చి చిత్రాన్ని పూర్తిచేశారు. 
                                                                             


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.