ఆసక్తిరేకెత్తిస్తున్న రానా ‘అరణ్య’ టీజర్‌

సినిమాలో తన పాత్ర నచ్చాలే కానీ ఏ తరహా లుక్‌లో కనిపించడానికైనా ఇట్టే సిద్ధమైపోతారు రానా. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’ కోసం ఓ సరికొత్త అవతారంతో బయటకొచ్చారు రానా. ప్రభు సోలోమన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. జోయా హుస్సేన్, శ్రియ, విష్ణు విశాల్, సామ్రాట్‌ కీలక పాత్రలు పోషించారు. ఇది హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేర్లతో విడుదల కాబోతుంది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర హిందీ, కన్నడ టీజర్లను బయటకొదిలారు. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో చిత్రం రూపొందించినట్లు టీజర్‌ను బట్టీ తెలుస్తోంది. ఈ ప్రచార చిత్రంలో రానా పాత్ర చిత్రీకరణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆయన బాడీ లాంగ్వేజి, లుక్స్‌ ‘శివపుత్రుడు’లో విక్రమ్‌ను తలపించేలా ఉన్నాయి. సినిమాలో ఏనుగులు, అడవి మృగాలతో కలిసి రానా చేసే సాహసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు సమాచారం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.